Perni Nani: చెప్పుతో కొట్టుకోవడం సుబ్బారాయుడికి అలవాటుగా మారింది: మంత్రి పేర్ని నాని
- భీమవరం జిల్లా కేంద్రంగా నరసాపురం జిల్లా
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కొత్తపల్లి సుబ్బారాయుడు
- ఇటీవల చెప్పుతో కొట్టుకున్న వైనం
- పార్టీలు మారినప్పుడల్లా చెప్పుతో కొట్టుకుంటున్నారన్న నాని
నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయాలన్న డిమాండ్ తో ఇటీవల వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకోవడం తెలిసిందే. అసమర్థుడైన స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశానని, అందుకే చెప్పుతో కొట్టుకుంటున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. చెప్పులతో కొట్టుకోవడం సుబ్బారాయుడుకు ఓ అలవాటుగా మారిందని విమర్శించారు. పార్టీలు మారిన ప్రతిసారి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుంటున్నారని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా విభజన విషయంలో అభ్యంతరాలు ఉంటే వ్యక్తపరిచేందుకు పలు అవకాశాలు కల్పించామని, ఏదైనా ఉంటే సీఎం జగన్ తో మాట్లాడడమో, ప్రభుత్వానికి నివేదించడమో చేయాలని హితవు పలికారు. కానీ, ఇటీవల సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నారని, ఎమ్మెల్యే ప్రసాదరాజును రాజకీయంగా అడ్డుతొలగించుకునేందుకే సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు భావిస్తున్నామని పేర్ని నాని తెలిపారు.
తనకు అసంతృప్తి కలిగినప్పుడల్లా చెప్పుతో కొట్టుకోవాలనుకుంటే సుబ్బారాయుడు చాలాసార్లు చెప్పుతో కొట్టుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నరసాపురం జిల్లా ప్రకటించి, భీమవరం కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందులో ఎమ్మెల్యేకు ఏం సంబంధం ఉంటుందో కొత్తపల్లి సుబ్బారాయుడు ఆలోచించుకోవాలని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటుందనే భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశామని పేర్ని నాని చెప్పారు.