Chhattisgarh: దేవదేవుడు శివుడికి సమన్లు పంపిన అధికారులు
- ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఘటన
- ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో దేవుడికి సమన్లు
- ఈ నెల 25లోగా విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా రెవెన్యూ అధికారులు చేసిన పని చర్చనీయాంశమైంది. ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో వారు ఏకంగా దేవదేవుడు శివుడికి సమన్లు పంపారు. ఈ నెల 25లోగా విచారణకు హాజరుకావాలని, లేదంటే ఆ భూమిని బలవంతంగా ఖాళీ చేయించడమే కాకుండా, రూ.10 వేల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని రాయ్‌గఢ్‌లోని 25వ వార్డుకు చెందిన సుధా రజర్వాడే హైకోర్టులో పిటిషన్ వేసి, శివాలయంతో పాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో దీనిపై నిజానిజాలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
విచారణ జరుపుతోన్న అధికారులు 10 మందికి సమన్లు ఇవ్వగా, వారిలో ఆరవ నిందితుడిగా శివుడికి సమన్లు పంపడం గమనార్హం. శివాలయాన్ని పిటిషనర్ నిందితుడిగా పేర్కొనడంతో అధికారులు ఈ పని చేసినట్లు తెలుస్తోంది.