AAP: డ్రైనేజీలోకి దిగి క్లీన్ చేసిన ఆప్ కార్పొరేటర్.. ఆ తర్వాత పాలతో స్నానం.. వైరల్ వీడియో ఇదిగో
- నిన్న ఢిల్లీ శాస్త్రిపార్క్ లో హసీబుల్ హసన్ సందర్శన
- పొంగిపొర్లుతున్న డ్రైనేజీలోకి దిగిన హసీబుల్
- ఆ వెంటనే పాలతో స్నానం చేయించిన అభిమానులు
- కనీసం వద్దని వారించని కార్పొరేటర్
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. రాజకీయ నాయకులు ఎన్నెన్ని వింత ప్రచారాలు చేస్తుంటారో మనం చూస్తూనే ఉంటాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్పొరేటర్ హసీబుల్ హసన్ కూడా అలాంటి వింత పోకడలే పోయారు.
నిన్న ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతాన్ని సందర్శించిన ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిలర్ హసీబుల్ హసన్.. అక్కడ పొంగిపొర్లుతున్న డ్రైనేజీని చూసి అసహనం వ్యక్తం చేశారు. కంపు కొట్టేస్తున్న ఆ డ్రైనేజీ నాలాలోకి ఛాతీ లోతు వరకు దిగిపోయారు. పారపట్టి చెత్తను ఏరారు. నాలా ఒడ్డున ఉన్న వారికి చెత్తను తోడిచ్చారు.
డ్రైనేజీ క్లీన్ చేసిన తర్వాత ఆయనకు అభిమానులు పాలతో స్నానం చేయించారు. జేజేలు పలుకుతూ బకెట్ పాలు ఆయనపై కుమ్మరించారు. అందుకు ఆయన వద్దని కూడా వారించలేదు. ఎంచక్కా కూర్చుని అభిషేకం చేయించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హసన్.. డ్రైనేజీ పొంగిపొర్లుతోందని ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఉన్నతాధికారులకు విషయాన్ని చెబుతున్నారే తప్ప సమస్యను మాత్రం పరిష్కరించడం లేదని ఆరోపించారు.
ఆ వీడియోలు కాస్తా వైరల్ కావడంతో.. ఇదంతా ఎన్నికల డ్రామా అంటూ ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు. వచ్చే నెలలోనే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసి ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ గా చేసే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, సవరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారమే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.