Jana Reddy: బోయిగూడ ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి.. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రెస్ నోట్ విడుదల
- బోయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం
- 11 మంది వలస కూలీల మృతి
- తొలిసారి హిందీలో పవన్ ప్రకటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. జనసేన ఆవిర్భావం నుంచి తెలుగులో మాత్రమే ప్రకటనలు విడుదల చేస్తూ వస్తోంది. ఏదేనీ అరుదైన సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ప్రకటన విడుదల చేసి ఉండొచ్చేమో గానీ.. హిందీలో మాత్రం ఆ పార్టీ నుంచి ప్రకటన రాలేదు. అయితే బుధవారం స్వయంగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ కనిపించింది. తెలుగులో మాత్రం ఆయన ఈ ప్రకటనను విడుదల చేయలేదు.
బుధవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది కూలీలు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ స్వయంగా పవన్ ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే. ఈ కారణంగానే వారి కుటుంబాలకు తన సానుభూతి అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఈ ప్రకటనను ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ విడుదల చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రకటనను రెండు భాషలలో విడుదల చేసిన పవన్.. తన సంతకాన్ని మాత్రం రెండింటిపైనా ఆంగ్లంలోనే పెట్టడం గమనార్హం.