China: జమ్మూకశ్మీర్ పై చైనా వ్యాఖ్యలను ఖండించిన భారత్
- ఇస్లామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన చైనా
- తమ అంతర్గత అంశంలో జోక్యం చేసుకోవద్దన్న భారత్
- జమ్మూకశ్మీర్ గురించి మాట్లాడే హక్కు ఏ దేశానికీ లేదని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ తమ అంతర్గత అంశమని ... ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనాకు భారత్ మరోసారి సూచించింది. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ, చైనా సహా ఏ దేశానికీ జమ్మూకశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎన్నడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
మరోవైపు ఈ వారంలో వాంగ్ యీ భారత్ లో పర్యటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఆయన జమ్మూకశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లో లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.