Kangana Ranaut: కంగన సెలబ్రిటీనే.. కానీ, నిందితురాలు కూడా: ముంబై కోర్టు తీవ్ర ఆగ్రహం
- జావెద్ అక్తర్ పరువు నష్టం దావాపై విచారణ
- రెండే సార్లు విచారణకు వచ్చిందంటూ మండిపాటు
- కంగన శాశ్వత మినహాయింపు విజ్ఞప్తి తిరస్కరణ
- మినహాయింపునిస్తే విచారణకు ఇక రానే రాదన్న జడ్జి
ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ పై ముంబై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె సెలబ్రిటీనే అయినా, షూటింగ్ లలో బిజీగా ఉన్నా.. ఆమె ఒక నిందితురాలన్న విషయాన్ని మరచిపోవద్దంటూ చురకలంటించింది. బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత జావెద్ అక్తర్.. ఆమెపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్ లో కార్యక్రమం సందర్భంగా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య సమయంలో.. బాలీవుడ్ లో ఓ కోటరీ ఉందనీ, అందులో జావేద్ కూడా వున్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఆయనపై పలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జావెద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు.
ఆ కేసును ముంబైలోని 10వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆర్ఆర్ ఖాన్ విచారిస్తున్నారు. పలు మార్లు విచారణకు కంగన డుమ్మా కొట్టడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటిదాకా కంగన రెండంటే రెండే సార్లు కోర్టు విచారణకు హాజరైందని, ఆమేం దేనికీ అతీతం కాదని తేల్చి చెప్పారు. కేసు విచారణకు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపునివ్వాలన్న కంగన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. అసలు కేసు విచారణ ఎక్కడిదాకా వెళ్లిందని మినహాయింపునివ్వాలని అసహనం వ్యక్తం చేశారు.
‘‘కేసు విచారణ మొదలైనప్పట్నుంచి కంగన రెండంటే రెండేసార్లు విచారణకు వచ్చింది. కేసు విచారణ మొదలైనప్పుడు ఒకసారి.. మరోసారి కోర్టుపై ఏకపక్ష ఆరోపణలు చేయడానికి. ఇప్పటిదాకా కోర్టుకు రాకుండా ఆమె తన నిబంధనలనే అమలు చేస్తోంది. తనకు ఇష్టమున్నప్పుడు వస్తోంది. ఇష్టమొచ్చినట్టు చేస్తోంది. ఆమెకు అసలు కోర్టుకు సహకరించాలన్న ధ్యాసే లేదు’’ అంటూ మండిపడ్డారు.
ఆమెపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా విచారణకు రాకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని, కావాలనే ఆమె ఎగ్గొడుతోందని మండిపడ్డారు. మినహాయింపు కావాలంటూ అప్పుడెప్పుడో కేసు విచారణ మొదలైనప్పుడు అడిగారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా వాటిపై ఆదేశాలివ్వాలంటూ మాట్లాడుతున్నారే తప్ప.. అసలు కేసు విచారణకు మాత్రం సహకరించడం లేదని మేజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ అన్నారు. ఇప్పటిదాకా ఆమె చేసిన విజ్ఞప్తులన్నింటికీ కోర్టు ఒప్పుకొందని, ఇకపై ఒప్పుకొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
గతంలో ఏనాడూ విచారణకు రాని కంగనకు ఇప్పుడు కోర్టు విచారణ హాజరుకు మినహాయింపునిస్తే ఇకపై తదుపరి విచారణల సందర్భంలో వివరాలిచ్చేందుకు అసలు రానేరాదని, కాబట్టి ఆమెకు మినహాయింపునిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 7వ తేదీకి విచారణను వాయిదా వేశారు.