K Kavitha: రోడ్డు పక్కనే వంటలు వండుతూ టీఆర్ఎస్ నేతలతో కలిసి కల్వకుంట్ల కవిత ధర్నా
- కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోందని ఆందోళన
- సికింద్రాబాద్‌లో ధర్నాలో పాల్గొన్న కవిత
- దేశ జీడీపీని పెంచకుండా, గ్యాస్, డీజిల్, పెట్రోల్ పెంచుతున్నారని చురకలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను అమాంతం పెంచేసిందని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నేడు టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద రోడ్డు పక్కనే వంటలు వండుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలని ఆమె అన్నారు.
తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత బీజేపీ సర్కార్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. దేశ జీడీపీని పెంచకుండా, గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) ధరలు పెంచుతున్నారని ఆమె చురకలంటించారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడకముందే పెట్రోల్ ధర లీటరుకి రూ.60 ఉండేదని చెప్పారు.
ప్రస్తుతం ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శలు గుప్పించారు. అంతేగాక, డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదని అన్నారు. కార్పొరేట్ వ్యక్తులకు మాత్రం రూ.11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలకు లొంగక తప్పదని చెప్పారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయట్లేదని ఆయన అన్నారు.
అంతేగాకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేసి సామాన్యులను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయన విమర్శించారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోందని అన్నారు.