Vladimir Putin: పుతిన్ మనస్తత్వంపై సైకాలజిస్టులు ఏమంటున్నారంటే...!

What Psychology experts says about Putin

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • ఫిబ్రవరి 24 నుంచి ముమ్మర దాడులు
  • ఉక్రెయిన్ ను నాజీల నుంచి విముక్తి చేస్తానంటున్న పుతిన్
  • పుతిన్ కనికరం లేని వాడంటున్న సైకాలజిస్టులు

ఉక్రెయిన్ పై దండయాత్ర నిర్ణయం మాత్రమే కాదు, గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఎంతో దూకుడైనవి. క్రిమియాను కలిపేసుకోవడం, సిరియాలో తిరుగుబాటు దళాలను చావుదెబ్బ తీయడం వాటిలో కొన్ని. తన అసాధారణ నిర్ణయాలతో ప్రపంచ రాజకీయ పరిశీలకులను నిశ్చేష్టకు గురిచేయడం పుతిన్ కు అలవాటుగా మారింది. కాగా, పుతిన్ ప్రతి మాటను, చర్యను, హావభావాలను నిశితంగా అధ్యయనం చేసిన సైకాలజీ నిపుణులు ఆయన మనస్తత్వంపై ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. 

ఏమాత్రం కనికరం లేని వ్యక్తి అని సైకాలజిస్టులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈసారి కూడా ఉక్రెయిన్ నాటోలో చేరకుండా అడ్డుకోవడం కోసం రష్యా శక్తిని మరోసారి చాటిచెప్పేందుకు నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయడ్డారు. ఉక్రెయిన్ ను నియో నాజీల నుంచి విముక్తి కల్పించడం కోసం అనే సాకుతో తీవ్ర దాడులకు తెరదీశాడని వివరించారు. 

ఉక్రెయిన్ పై రష్యా ఫిబ్రవరి 24న సైనిక చర్య ప్రారంభించింది. అప్పటినుంచి ఉక్రెయిన్ ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్నారు. స్టాలిన్ తర్వాత అత్యంత సుదీర్ఘకాలం రష్యాను పాలించింది పుతినే. వాస్తవానికి పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024తో ముగియనుంది. కానీ, రాజ్యాంగాన్నే మార్చివేసి, జీవితకాలం తానే అధ్యక్షుడిగా కొనసాగేందుకు పుతిన్ మార్గం సుగమం చేసుకున్నారు. తద్వారా రష్యాలో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. 

ఇలాంటి చర్యలు పుతిన్ కు కొత్త కాదు. పుతిన్ ను తరచుగా సద్దామ్ హుస్సేన్, ముమార్ గడాఫీ, అడాల్ఫ్ హిట్లర్ లతో పోల్చడం తెలిసిందే. దీనిపై సైకాలజిస్టులు స్పందిస్తూ, అందుకు కారణం ఉందని వెల్లడించారు. 

"పుతిన్ తాను అనుకున్నది కార్యరూపం దాల్చేంత వరకు ఎంతదాకా అయినా వెళతారు. ఈ క్రమంలో ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపరు. పుతిన్ కు బలమైన లక్ష్యం ఉంది" అని అమెరికా ప్రభుత్వ ప్రాంతీయ మాజీ వైద్యాధికారి, సైకాలజీ ఎక్స్ పర్ట్ కెన్నెత్ డెక్లెవా పేర్కొన్నారు. 

"1991 ప్రచ్ఛన్న యుద్ధానంతరం జరిగిన పరిణామాలను పుతిన్ ఏమాత్రం అంగీకరించని వ్యక్తి. అందుకే ప్రచ్ఛన్నయుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులను మళ్లీ సృష్టించాలనుకుంటున్నారు. పుతిన్ క్రూరస్వభావం కొత్తేమీ కాదు. ఎదుటి వ్యక్తి కంటే తాను బలహీనుడ్ని అనే భావనను పుతిన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేరు. అందుకే పుతిన్ ను బలహీనుడిగా చూడడమో, పుతిన్ పై దాడులకు దిగడమో, వేధించడమో చేయరాదని చెబుతాను. ఒకవేళ అలా చేస్తే పుతిన్ లోని ప్రతిఘటన తీవ్రస్థాయిలో ఉంటుంది. అది దారుణమైన పర్యవసానాలకు దారితీస్తుంది" అని డెక్లెవా విశ్లేషించారు. 

జేవియర్ ఉర్రా అనే ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ స్పందిస్తూ... పుతిన్ సరీసృపాల (పాములు, బల్లులు) తరహా వ్యక్తిత్వం కలవాడని, అతడి మనస్తత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ పోలిక సరైనదని పేర్కొన్నారు. 

"పుతిన్ తనకు నచ్చిందే చేస్తారు. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించరు. తనను ఎవరూ ఇష్టపడడంలేదని, ప్రజలు తనను చూసి భయపడుతున్నారని గుర్తించిన ఓ చిన్నపిల్లవాడి మనస్తత్వం వంటిదే పుతిన్ మనస్తత్వం. అందుకే పుతిన్ అప్పుడుప్పుడు వంటిపై చొక్కా లేకుండా కనిపించడమో, నచ్చిన ఆట ఆడుతూనో కనిపిస్తారు" అని జేవియర్ వివరించారు. 

కాగా, పుతిన్ బాల్యం ఏమంత సజావుగా అనిపించదు. పుతిన్ 1952లో సోవియట్ లెనిన్ గ్రాడ్ లో జన్మించారు. పుతిన్ పుట్టక ముందే ఇద్దరు తోబుట్టువులు మరణించారు. చిన్నతనంలోనే అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడేవాడని జెరూసలేమ్ పోస్ట్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ దూకుడు కారణంగానే పుతిన్ జూడో అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణమైందని వివరించింది.

  • Loading...

More Telugu News