Petrol: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఏపీలో రూపాయి, తెలంగాణలో 57 పైసలు పెరుగుదల

Petrol Diesel Rates Raised Fifth Time In Six Days

  • విజయనగరంలో వ్యాట్, ఇతర ఖర్చులు కలిపి రూ.1.99 పెంపు
  • ఇవాళ పెట్రోల్ పై 50 పైసలు, డీజిల్ పై 55 పైసలు పెంచిన కేంద్రం
  • ఆరు రోజుల్లో ఐదు సార్లు పెంచి వినియోగదారులకు షాక్

దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు కొనసాగుతూనే ఉంది. రోజువారీ ధరల సవరణను పున:ప్రారంభించిన మార్చి 22 నుంచి ఇప్పటిదాకా ఆరు రోజుల్లో ఐదు సార్లు చమురు సంస్థలు ధరలను బాదేశాయి. ఈ ఐదు రోజుల్లో పెట్రోల్ పై లీటర్ కు రూ.3.70, డీజిల్ పై రూ.3.75 పెంచేశాయి. తాజాగా ఇవాళ కూడా చమురు సంస్థలు పెట్రోల్ పై మరో 50 పైసలు, డీజిల్ పై 55 పైసలను పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. 

ప్రస్తుతం పెంచిన ధరలతో తెలంగాణ (హైదరాబాద్)లో పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ ధర రూ.98.69గా ఉంది. వ్యాట్ తో కలిపి లీటర్ పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 59 పైసలు పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.115.09 (98 పైసలు)గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.22 (98 పైసల పెంపు)కు పెరిగింది. ములుగు, సిద్దిపేట జిల్లాల్లో రూపాయికి పైగా ధరలు పెరిగాయి. 

ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.59గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.99.54కి పెరిగింది. వ్యాట్ తో కలిపి ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ మీద రూ.0.95, డీజిల్ పై రూ.0.90 పెరిగాయి. జిల్లాలను బట్టి కూడా ధరలు మారుతున్నాయి. అక్కడి రవాణా తదితరాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని జిల్లాల్లో రూపాయికి పైగా ధరలు పెరిగాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూపాయికిపైగా ధరలు పెరిగాయి. విజయనగరంలో అయితే దాదాపు రూ.2 పెంపు నమోదైంది. ఢిల్లీలో రూ.99.11, రూ.90.42గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.88గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.13గా ఉంది. 

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దాదాపు నాలుగున్నర నెలల పాటు పెట్రోల్ ధరల జోలికి పోని కేంద్ర ప్రభుత్వం.. అవి అయిపోయి ఫలితాలు వచ్చిన వెంటనే మళ్లీ ధరల సవరణను మొదలు పెట్టేసింది. వినియోగదారునికి చుక్కలు చూపిస్తోంది. ఎన్నికల టైంలో బ్యారెల్ ముడిచమురు ధర 82 డాలర్లుగా ఉంది. అయితే, ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఒకానొక సందర్భంలో బ్యారెల్ చమురు 132 డాలర్లకు ఎగబాకింది. 

అయినా కూడా ధరల భారాన్ని మాత్రం వినియోగదారులపై వెయ్యలేదు. దీంతో ఆయిల్ సంస్థలకు దాదాపు రూ.19 వేల కోట్ల నష్టం వచ్చినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే లీటర్ డీజిల్ పై రూ.13.10 నుంచి రూ.24.90, పెట్రోల్ మీద రూ. 10.60 నుంచి రూ.22.30 వరకు పెంచాల్సిన అవసరం ఉంటుందని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ నిపుణులు చెబుతున్నారు. 

క్రిసిల్ రీసెర్చ్ ప్రకారం.. బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలలు ఉంటే చమురు ధరలను లీటర్ పై రూ.9 నుంచి 12 వరకు వినియోగదారుల మీద భారం మోపాల్సి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ బ్యారెల్ చమురు ధర 110 నుంచి 120 డాలర్ల మధ్య ఉంటే లీటర్ పై రూ.15 నుంచి రూ.20 వరకు పెంచాల్సి ఉంటుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News