RRR: అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫస్టాఫ్ మాత్రమే వేసిన థియేటర్!
- ఇంటర్వెల్ రాగానే సినిమా అయిపోయిందని ప్రకటించిన థియేటర్
- నిడివి విషయంలో గందరగోళం
- చాలా చర్చల తర్వాత సెకండాఫ్ వేసిన వైనం
ప్రపంచవ్యాప్తంగా 7 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అమెరికాలోనూ అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. అయితే, ఓ థియేటర్ లో మాత్రం సినిమాను ఫస్టాఫ్ వేసి.. సెకండాఫ్ లేదంటూ థియేటర్ లో కూర్చున్న వారికి చెప్పారట.
అమెరికాలోని సినీమార్క్ థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అనుపమా చోప్రా అనే రివ్యూయర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రథమార్ధం అయిపోయి ఇంటర్వెల్ పడగానే.. సినిమా అయిపోయినట్టు థియేటర్ యాజమాన్యం ప్రకటించిందని, అదేంటని అడిగితే సినిమా 3 గంటల నిడివి ఉందన్న విషయం తమకు తెలియదని యాజమాన్యం చెప్పిందని అనుపమ తెలిపారు.
ఆ తర్వాత అభిమానులు కొంత అసహనం ప్రదర్శించడం, చాలా సేపు చర్చించిన అనంతరం సినిమా సెకండాఫ్ ను ప్రదర్శించారని తెలిపారు. అయితే, గతంలోనూ ఇలాంటి సందర్భాలు జరిగిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేశారు. అక్కడి వారికి ఇండియన్ సినిమాల నిడివి గురించి అవగాహన లేదని అంటున్నారు.
వాస్తవానికి హాలీవుడ్ లో సినిమాలు మామూలుగా గంటన్నర నుంచి రెండు గంటల మధ్యే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా నిడివిపై థియేటర్ యాజమాన్యం గందరగోళానికి గురైనట్టు భావిస్తున్నారు.