Amarnath Yatra: జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర... తేదీలు ఖరారు
- అమర్ నాథ్ లో ప్రతి ఏటా మంచు లింగం
- వేలాదిగా భక్తులు రాక
- జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన ఆలయ బోర్డు సమావేశం
- 43 రోజుల పాటు అమర్ నాథ్ యాత్ర
దేశవ్యాప్తంగా ఉన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్ నాథ్ లో ప్రతి ఏటా మంచు లింగం ఏర్పడడం తెలిసిందే. ఇక్కడ వేసవిలో తప్ప మిగతా అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాగా, ఇక్కడి గుహలో మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతి ఏటా అమర్ నాథ్ కు కొన్ని వేల మంది భక్తులు తరలి వచ్చి ఈ మంచు లింగాన్ని దర్శించుకుంటారు.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు చేసింది. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్ర ముగియనుంది.
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన నేడు అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్ర తేదీలను నిర్ణయించారు. అయితే, కరోనా వ్యాప్తి ఇంకా ముగియనుందని, అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ యాత్ర నిర్వహించాలని తీర్మానించారు.