Payal Rohatgi: అవకాశాల కోసం క్షుద్రవిద్యలు ప్రయోగించాను... ఓ బాలీవుడ్ నటి సంచలనం

Bollywood actress Payal Rohatgi confesses that she had learn occult practices
  • హిందీలో సరికొత్త రియాలిటీ షో 'లాకప్'
  • హోస్ట్ గా కంగనా రనౌత్
  • కంటెస్టెంట్ గా పాయల్ రోహాత్గీ
  • 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన రోహాత్గీ
  • ఢిల్లీలో చేతబడి, వశీకరణం నేర్చుకున్నట్టు వెల్లడి
బిగ్ బాస్ రియాలిటీ షో విశేష ప్రజాదరణ పొందడంతో అదే బాటలో అనేక రియాలిటీ షోలు వస్తున్నాయి. తాజాగా హిందీ బుల్లితెర రంగంలో మరో రియాలిటీ షో ప్రారంభమైంది. దీని పేరు లాకప్. ఇందులో కూడా కంటెస్టెంట్లు, ఎలిమినేషన్ వంటి అంశాలు ఉంటాయి. లాకప్ రియాలిటీ షోకి సంచలన నటి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తుండడంతో అందరి దృష్టి ఈ కార్యక్రమంపై పడింది. 

ఇందులో బాలీవుడ్ నటి పాయల్ రోహాత్గీ కూడా ఒక కంటెస్టెంట్. అయితే, షోలో భాగంగా ఎలిమినేషన్ ను తప్పించుకోవాలంటే కంటెస్టెంట్ ఇప్పటివరకు ఎవరికీ చెప్పని ఓ రహస్యాన్ని అందరితో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పాయల్ రోహాత్గీ చెప్పింది విని హోస్ట్ కంగనా రనౌత్ సహా ఇతర కంటెస్టెంట్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలీవుడ్ కు వచ్చిన తర్వాత ఓ దశలో అవకాశాలు రాలేదని, దాంతో అనేక క్షుద్రవిద్యలు నేర్చుకున్నానని రోహాత్గీ వెల్లడించింది. 

తాను నేర్చుకున్న క్షుద్రవిద్యల్లో వశీకరణం, చేతబడి వంటివి కూడా ఉన్నాయని, అవకాశాలు రాబట్టుకునేందుకు ఆ విద్యలను ప్రయోగించానని వివరించింది. 15 ఏళ్ల కిందట బాలీవుడ్ కు వచ్చానని, ప్రారంభంలో కెరీర్ ఉత్సాహంగానే నడించిందని వెల్లడించింది. ఓ దశలో ఎవరూ చాన్సులు ఇవ్వలేదని, దాంతో ఎలాగైనా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించింది. 

ఢిల్లీలోని ఓ తాంత్రిక పూజారి సాయంతో చేతబడి, వశీకరణ విద్యలు నేర్చుకున్నానని, తిరిగి ముంబయి వచ్చి అనేకమందిపై వాటిని ప్రయోగించినట్టు తెలిపింది. అయితే, క్షుద్రవిద్యల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని త్వరలోనే స్పష్టమైందని, కొన్ని చాన్సులు మామూలుగానే వచ్చాయని పాయల్ రోహాత్గీ పేర్కొంది.

 దాంతో కంగనా అందుకుని... నీకు అందం, ప్రతిభ ఉన్నప్పుడు ఇలాంటి విద్యలతో అవసరమేంటి అని ప్రశ్నించింది. ఒకవేళ నీ బాయ్ ఫ్రెండ్ కు ఈ విషయం తెలిస్తే పాపం అతడి పరిస్థితి ఏంటో అని సందేహం వెలిబుచ్చింది. అయితే, తాను మనసిచ్చిన ప్రియుడిపై మాత్రం ఎలాంటి వశీకరణ విద్య ప్రయోగించలేదని పాయల్ రోహాత్గీ స్పష్టం చేసింది .
Payal Rohatgi
Occult Practices
Chaces
Lockup
Kangana Ranaut
Bollywood

More Telugu News