Janaganamana: పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో 'జనగణమన'... ముంబయిలో ఓపెనింగ్.. విజయ్ ఎంట్రీ మామూలుగా లేదుగా!
- హెలికాప్టర్ లో వచ్చిన విజయ్ దేవరకొండ
- ఆర్మీ దుస్తుల్లో విజయ్
- పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై చిత్రం
- 2023 ఆగస్టు 3న రిలీజ్
ఓవైపు లైగర్ విడుదలకు సిద్ధమవుతుండగానే, పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో మరో చిత్రం ప్రకటించారు. జనగణమన (జేజీఎమ్) అనే టైటిల్ తో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం నేడు ఓపెనింగ్ జరుపుకుంది. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబయిలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో రాగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ కమాండో వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు.
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. పూరీ జగన్నాథ్ జనగణమన కథను గతంలోనే మహేశ్ బాబుతో తీయాలని కోరుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు ఫైనల్ కాకపోవడంతో, ఇప్పుడు విజయ్ దేవరకొండతో తీస్తున్నట్టు సమాచారం. అయితే, మహేశ్ తో అనుకున్న కథ ఇదేనా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. టైటిల్ మాత్రం పూరీ సర్కిల్ లో ఎప్పట్నించో వినిపిస్తోంది.
కాగా ఈ చిత్ర నిర్మాణంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాలుపంచుకుంటున్నాడు. మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరఫున వంశీ పైడిపల్లి ముంబయిలో జనగణమన సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇవాళే ఎనౌన్స్ చేశారు. 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని వెల్లడించారు.
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఇది ప్రధానంగా సైనిక నేపథ్యంలో వచ్చే సినిమా అని తెలుస్తోంది. త్వరలోనే ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.