Mekapati Goutham Reddy: కడపలో ముల్క్ హోల్డింగ్స్ హబ్.. రూ.1,500 కోట్లతో ఏర్పాటు
- గౌతం రెడ్డి బతికుండగా దుబాయిలో ఒప్పందం
- ఆ ఒప్పందం మేరకే కొప్పర్తిలో ముల్క్ హోల్డింగ్స్ హబ్
- రూ.1,500 కోట్లను వెచ్చించనున్న కంపెనీ
- వెయ్యి మందికి ప్రత్యక్షంగా, 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి
- సీఎం జగన్‌తో భేటీ అయిన సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్
గుండెపోటుతో చనిపోవడానికి ముందు ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం దుబాయిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో బిజీబిజీగా గడిపిన గౌతం రెడ్డి.. పలు కీలక పారిశ్రామిక సంస్థలతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలను ఆయన ఒప్పించారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
గౌతం రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ముల్క్ హోల్డింగ్స్ ఏపీలో తన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వచ్చిన ముల్క్ హోల్డింగ్స్ చైర్మన్ నవాబ్ షాజీ ఉల్ ముల్క్ తన ప్రతినిధి బృందంతో కలిసి ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.
గౌతంరెడ్డి సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కడప జిల్లా కొప్పర్తిలో తమ సంస్థ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకోసం ఆ సంస్థ రూ.1,500 కోట్లను వెచ్చించనుంది. ఈ హబ్‌తో ప్రత్యక్షంగా 1,000 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.