BIMSTEC: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
- వాటి నిలకడ ప్రశ్నార్థకమైందన్న మోదీ
- బిమ్స్ టెక్ సదస్సులో కీలక వ్యాఖ్యలు
- ప్రాంతీయ సహకారం పెంచుకోవాలని పిలుపు
- అనుసంధానత, సౌభాగ్యత, భద్రతకు కలిసి ముందుకు సాగాలని కామెంట్
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన శ్రీలంక అధ్యక్షతన నిర్వహించిన బిమ్స్ టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో ఆపరేషన్) సదస్సులో ఆయన వర్చువల్ గా మాట్లాడారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో యూరప్ లో జరుగుతున్న కొన్ని సంఘటనలు అంతర్జాతీయ చట్టాల స్థిరత్వం, పరిధిని ప్రశ్నిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ బంధాలు బలపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1997లో కలిసి లక్ష్యాలను అధిగమించినట్టే.. ఇప్పుడూ బిమ్స్ టెక్ దేశాలూ కలిసి ముందుకు సాగాలని అన్నారు. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనుసంధానత, సౌభాగ్యత, భద్రతను పెంపొందించుకోవాల్సి ఉందన్నారు. బిమ్స్ టెక్ గ్రూప్ నిర్మాణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఓ చార్టర్ ను తీసుకొస్తున్నామని చెప్పారు.
నలంద అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న బిమ్స్ టెక్ స్కాలర్ షిప్ ను పొడిగిస్తున్నామని ప్రధాని చెప్పారు. బిమ్స్ టెక్ నిర్వహణ ఖర్చులకు గానూ 10 లక్షల డాలర్లను ఇస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. కాగా, బిమ్స్ టెక్ గ్రూప్ లో భారత్, శ్రీలంకతో పాటు మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, నేపాల్, భూటాన్ లు భాగంగా ఉన్నాయి.