MS Dhoni: మొదటి బంతికే సిక్సర్.. ధోనీ ఖాతాలో రెండు కొత్త రికార్డులు
- లక్నో జట్టుతో పోరులో వచ్చీ రావడంతోనే సిక్సర్
- ధోనీ కెరీర్ లో తొలి బంతి సిక్సర్ ఇదే మొదటిది
- 19వ ఓవర్లో అత్యధిక సిక్సర్లతో డివిలియర్స్ సరసన
- 7,000 పరుగుల మైలురాయికి చేరిక
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఖాతాలో రెండు కొత్త రికార్డులు జత చేసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ధోనీ వచ్చీ రావడంతోనే మొదటి బంతినే సిక్సర్ గా మలిచాడు.
శివమ్ దూబే అవుట్ కావడంతో 19వ ఓవర్ లో ధోనీ బ్యాట్ తో రంగ ప్రవేశం చేశాడు. అవేశ్ ఖాన్ సంధించిన మొదటి బంతిని ప్రేక్షకుల గ్యాలరీకి పంపాడు. ధోనీ తన ఐపీఎల్ కెరీర్ లో ఇన్నింగ్స్ లో మొదటి బంతికే సిక్సర్ సాధించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం రెండు సార్లు దీన్ని సాధించాడు.
ఐపీఎల్ హిస్టరీలో 19వ ఓవర్లో ఎక్కువ సిక్సర్ లు సాధించిన ఆటగాడిగా ఆర్సీబీ మాజీ సభ్యుడు ఏబీ డివిలియర్స్ సరసన ధోనీ నిలిచాడు. ఐపీఎల్ లో 19 ఓవర్లో ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ 36 సిక్సర్లతో సమానంగా ఉన్నారు. ఆ తర్వాత ఆండ్రూ రస్సెల్ 26 సిక్సర్లు, కిరెన్ పోలార్డ్ 24 సిక్సర్లు, హార్దిక్ పాండ్యా 24 సిక్సర్లతో వరుస స్థానాల్లో ఉన్నారు.
ఇక ఇదే మ్యాచ్ లో ధోనీ మొత్తం 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 16 పరుగుల సాధనతో అతడు టీ20 ఫార్మాట్ లో 7,000 పరుగుల క్లబ్ లోకి చేరిపోయాడు. ఇప్పటివరకు మొత్తం 7,001 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ 10,326 పరుగులతో పట్టికలో మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 9,936 పరుగులు సాధించగా.. శిఖర్ ధావన్ 8,818 పరుగులు, రాబిన్ ఊతప్ప 7,070 పరుగులతో ధోనీ కంటే ముందున్నారు.