YSRCP: పెట్రో ధరలపై నిరసనలేవీ?.. టీడీపీ, జనసేనలపై అంబటి విసుర్లు
- ఇంధన ధరలపై లోకేశ్, పవన్ ఎందుకు నోరు విప్పట్లేదు?
- కేంద్రంలోని బీజేపీ అంటే భయపడుతున్నారా?
- విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై భారం రూ.1,400 కోట్లు మాత్రమేనన్న అంబటి
ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలపై నిరసనలు తెలుపుతున్న విపక్షాలు టీడీపీ, జనసేనలు పెరిగిన ఇంధన ధరలపై ఆందోళనలు ఎందుకు చేయట్లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాలో మాట్లాడిన అంబటి..పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే లోకేశ్ నోరు విప్పట్లేదని దెప్పి పొడిచారు. పెరిగిన ఇంధన ధరలపై నిరసనలు చేయాలంటే భయమేస్తోందా? అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పవర్ స్టార్ అన్న బిరుదు ఉందని గుర్తు చేసిన అంబటి.. ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై తన పవర్ చూపించవచ్చు కదా? అంటూ సెటైర్లు సంధించారు. పనిలో పనిగా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలపైనా మాట్లాడిన అంబటి.. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పరిణామాలతో విద్యుత్ ఛార్జీలు పెంచటం అనివార్యం అయ్యిందన్నారు. తాజాగా పెరిగిన విద్యుత్ చార్జీలతో రూ.1400 కోట్ల భారం మాత్రమే ప్రజలపై పడితే టీడీపీ మాత్రం 42 వేల కోట్ల భారం వేశారని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.