Bharat Biotech: కొవాగ్జిన్ టీకా ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించిన భారత్ బయోటెక్
- ప్రకటించిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్
- టీకాలకు డిమాండ్ తగ్గడం, సరఫరా పూర్తి కావడంతోనే నిర్ణయం
- ఏడాది కాలంగా ఊపిరిసలపకుండా పనిచేశామన్న సంస్థ
కరోనా టీకా కొవాగ్జిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ నిన్న ప్రకటించింది. టీకాలకు క్రమంగా డిమాండ్ తగ్గుతుండడం, టీకా సేకరణ సంస్థలకు ఒప్పందం మేరకు టీకాల సరఫరా పూర్తికావడంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ టీకాను భారీగా ఉత్పత్తి చేయడం, అందుకోసం ఏడాది కాలంగా తమ ఉత్పత్తి కేంద్రాలన్నీ నిరంతరాయంగా పనిచేశాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పుడీ కేంద్రాలన్నింటినీ నవీకరించే ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే అంశంపై దృష్టిసారిస్తామని వివరించింది.