Muslims: ఉగాది రోజున వెంకటేశ్వరస్వామి ఆలయానికి ముస్లింలు... ఎందుకంటే..!
- తిరుమల క్షేత్రానికి దారితీసే మార్గంలో తొలి గడపగా కడప
- కడపలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి
- బీబీ నాంచారమ్మను పెళ్లాడిన వెంకటేశుడు
- స్వామివారిని ఇంటి అల్లుడిగా భావిస్తున్న ముస్లింలు
- ప్రతి ఉగాది నాడు నాంచారమ్మకు సారె
ఇవాళ శుభకృత్ నామ సంవత్సరాది కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభ కనిపిస్తోంది. భక్తులతో ఆలయాల్లో కోలాహలం నెలకొంది. కాగా, ప్రతి ఉగాదికి ముస్లింలు వెంకటేశ్వరస్వామిని దర్శించడం ఒక్క కడప జిల్లాలోనే చూస్తాం. తిరుమల క్షేత్రానికి దారితీసే ప్రాచీన మార్గానికి తొలి గడపగా కడపలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. ఉగాది పండుగ రోజున ఈ ఆలయానికి ముస్లింలు పోటెత్తుతారంటే అతిశయోక్తి కాదు.
గత వందేళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. తాజాగా శుభకృత్ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీనివెనకున్న కారణాన్ని ఆలయ అర్చకులు మీడియాకు వివరించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని, దాంతో వెంకటేశ్వరస్వామిని ముస్లింలు తమ ఇంటి అల్లుడిగా భావిస్తారని తెలిపారు. ప్రతి ఉగాది నాడు బీబీ నాంచారమ్మకు సారె తెచ్చి కడపలో వెలిసిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ముస్లిం భక్తులు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఉగాదికి స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఏడాది పొడవునా తమకు ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతామని తెలిపారు.