Omicron: ఒమిక్రాన్‌లో ‘ఎక్స్ఈ’ అనే మరో రకం గుర్తింపు.. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం!

Omicron Variant XE found in Britain in January
  • ఈ ఏడాది జనవరి 19నే గుర్తింపు 
  • అప్పటి నుంచి ఇప్పటి వరకు 600కు పైగా జన్యుక్రమాలు
  • ‘ఎక్స్ఈ’ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్న ప్రపంచ ఆరోగ్య  సంస్థ
కరోనా ప్రభావం చల్లారిపోయిందనుకుంటున్న వేళ ఒమిక్రాన్ తెరపైకి రాగా, ఇప్పుడు అందులో మరో కొత్త రకం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌లో గుర్తించిన ఈ వేరియంట్‌ను ‘ఎక్స్ఈ’గా పిలుస్తున్నారు. గత స్ట్రెయిన్‌లతో పోలిస్తే దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. తాజా వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అయిన బీఏ 1, బీఏ2ల మిశ్రమ ఉత్పరివర్తనమని పేర్కొంది. 

ఈ ఏడాది జనవరి 19నే దీనిని కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 600కు పైగా జన్యుక్రమాలు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే, ఈ వేరియంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని హెచ్చరించింది.

‘ఎక్స్ఈ’ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, తీవ్రత, అది ప్రవర్తించే తీరును అంచనా వేసే వరకు దీనిని కూడా ఒమిక్రాన్‌కు సంబంధించినది గానే పరిగణిస్తున్నట్టు వివరించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందుబాటులోకి రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.
Omicron
Omicron XE
WHO
Corona Virus

More Telugu News