Social Media: శ్రీలంక వ్యాప్తంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ సేవలపై నిషేధం
- శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం
- నిరసనలతో హోరెత్తిస్తోన్న ఆందోళనకారులు
- తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా చర్యలు
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆందోళనల వేళ అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు శ్రీలంకలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు శ్రీలంక వ్యాప్తంగా నిలిచిపోయాయి. కాగా, నిత్యావసరాల ధరలు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
శ్రీలంక భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు ఇవ్వడంతో ఆ దేశంలో ఎప్పుడు ఏ పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన నెలకొంది. ఎవరైనా నిరసన ప్రదర్శనలకు దిగితే వారిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
అయితే, సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స ఖండించారు. ఇటువంటి చర్యలను తాను ఎప్పటికీ సమర్థించబోనని చెప్పారు. దేశంలో ఆందోళనలు అణచివేయడానికి పెట్టిన ఇలాంటి ఆంక్షలు పనిచేయవని అభిప్రాయపడ్డారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.