Punjab Kings: రాతమారని చెన్నై.. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమి
- బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన పంజాబ్
- 54 పరుగుల తేడాతో ఓటమి పాలైన చెన్నై
- 4 ఓవర్లు వేసి ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్న ముకేశ్
- ఐపీఎల్‌లో రెండోసారి ఆలౌట్ అయిన చెన్నై
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పరాజయాలు వెంటాడుతున్నాయి. మూడు మ్యాచ్‌లు ఆడినా ఇప్పటి వరకు బోణీ కొట్టలేకపోయింది. గత రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోమారు ఓటమి పాలైంది. బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో ఓటమి మూటగట్టుకుంది. మరోవైపు, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో రాణించిన పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ లివింగ్ స్టోన్ చెలరేగిపోవడంతో 180 పరుగులు చేసింది.
అనంతరం 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 126 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. శివమ్ దూబే ఒక్కడే పంజాబ్ బౌలర్లను ఎదురొడ్డ గలిగాడు. 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ 28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23 పరుగులు చేశాడు. మొయిన్ అలీ, కెప్టెన్ రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో డకౌట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ మూడు వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, లివింగ్‌స్టోన్ రెండేసి వికెట్లు, రబడ, అర్షదీప్, ఓడియన్ స్మిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ జోరు చూసి పంజాబ్ స్కోరు 200 దాటుతుందని భావించారు. అయితే, లివింగ్‌స్టోన్ అవుటైన వెంటనే బ్యాటర్లు ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు క్యూకట్టారు. జితేశ్ శర్మ మాత్రం కాసేపు మెరిపించాడు. 17 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రిటోరియస్ రెండేసి వికెట్లు తీసుకోగా, ముకేశ్, బ్రావో, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్‌లో చెన్నై ఆలౌట్ కావడం 2018 తర్వాత ఇది రెండోసారి. అలాగే, 50కి పైగా పరుగుల తేడాతో ఓడిపోవడం ఇది రెండోసారి. 2013లో వాంఖడే స్టేడియంలో ముంబై చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోగా, ఇప్పుడు పంజాబ్ చేతిలో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.