Vijay Sai Reddy: రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ.28 వేల కోట్లు విడుదల చేసాం .. పార్లమెంటులో కేంద్రం ప్రకటన
- ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
- 2015 నుంచి 2021 మధ్యలో నిధుల విడుదల
- ఆర్థిక సంఘాల సూచన మేరకే విడుదల చేశామన్న కేంద్రం
రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులతో ప్రస్థానం ప్రారంభించిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటు వేదికగా ఓ కీలక ప్రకటన చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద ఏపీకి ఏకగా రూ.28 వేల కోట్లను విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఓ ప్రకటన చేశారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంధించిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 నుంచి 2021 మధ్యలో ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.28 వేల కోట్లను విడుదల చేసినట్టు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఆర్థిక సంఘాల సిఫారసు మేరకే ఈ నిధులను విడుదల చేశామని కూడా ఆయన వెల్లడించారు.