IPL 2022: మరోమారు తేలిపోయిన సన్‌రైజర్స్ బ్యాటింగ్.. వరుసగా రెండో ఓటమి
- త్రిపాఠి, పూరన్ మినహా రాణించలేకపోయిన బ్యాటర్లు
- హైదరాబాద్‌ను దెబ్బకొట్టిన అవేశ్ ఖాన్, హోల్డర్
- నాలుగు వికెట్లు పడగొట్టిన అవేశ్‌ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ఈసారి బౌలర్లు కాస్తంత పర్వాలేదనిపించినా, బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు, దీపక్ హుడా మరోమారు బంతిపై విరుచుకుపడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 169 పరుగులు చేసింది.
జట్టులో రాహుల్ త్రిపాఠి (30 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 44 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, పూరన్ చేసిన 34 పరుగులు రెండో అత్యధికం. చివరి ఓవర్లో జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా, వాషింగ్టన్ సుందర్ (18), భువనేశ్వర్ (1), రొమారియో షెపర్డ్ (8)లను హోల్డర్ పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 157/9 వద్ద ముగిసింది. ఫలితంగా లక్నో 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మూడు మ్యాచ్‌లు ఆడిన లక్నోకు ఇది రెండో విజయం కాగా, రెండు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఇంకా ఖాతా తెరవలేదు. లక్నో బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హోల్డర్‌కు మూడు, కృనాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి.
ఆయుష్ బడోని 12 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేయడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. డికాక్ (1), లూయిస్ (1), మనీష్ పాండే (11), కృనాల్ పాండ్యా (6) దారుణంగా నిరాశపరిచారు. హైదరాబాద్ బౌలర్లలో సుందర్, షెపర్డ్, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఐపీఎల్లో నేడు రాజస్థాన్ రాయల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి.