Avesh Khan: ఫలించిన అవేశ్ ఖాన్ ‘స్లో బౌలింగ్’ మంత్రం
- ఆరంభంలో నిదానంగా బౌలింగ్ చేద్దామనుకున్నా
- అలా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయ్
- పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వికెట్లు తీయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానన్న అవేశ్ ఖాన్
సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చక్కని విజయం సొంతం చేసుకోవడంలో పేసర్ అవేశ్ ఖాన్ కీలకంగా వ్యవహరించాడు. కాకపోతే గత మ్యాచుల్లో మాదిరి కాకుండా అతడు అనుసరించిన భిన్నమైన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది. పవర్ ప్లేలోనూ, చివరి ఓవర్లలోనూ (డెత్ ఓవర్లు) రెండు చొప్పున మొత్తం నాలుగు వికెట్లను అవేశ్ ఖాన్ పడగొట్టాడు. దీనిపై మ్యాచ్ అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు.
‘‘జట్టుకు వికెట్లు ఇవ్వాలన్నదే నా ధ్యేయం. ఎందుకంటే నా నుంచి టీమ్ కోరుకునేది అదే. పవర్ ప్లేలో, స్లాగ్ ఓవర్స్ లోనూ వికెట్లు తీయాలని ముందుగానే అనుకున్నాను. కాస్తంత వేగం తగ్గించి బౌలింగ్ చేయాలని నాకు ఆలోచన వచ్చింది. ఇన్నింగ్స్ మొదట్లో స్లో బాల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నట్టు గుర్తించా. దాంతో పవర్ ప్లేలో అదే చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని అవేశ్ ఖాన్ వివరించాడు. అధ్యయనం ద్వారా తన బౌలింగ్ తీరును మార్చి ఫలితాలను సాధించడంలో అతడు నూరు శాతం విజయం సాధించినట్టు తెలుస్తోంది.
పవర్ ప్లేలో ఓపెనర్లు విలియమ్సన్, అభిషేక్ శర్మ వికెట్లు తీసిన అవేశ్ ఖాన్.. డెత్ ఓవర్లలో నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్ వికెట్లను పడగొట్టి విజయానికి దారి చూపించాడు.