Andhra Pradesh: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకి షాక్.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
- మార్చి 21న మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఏబీ
- ప్రభుత్వ అనుమతి లేకుండా మాట్లాడారన్న సీఎస్
- ఆలిండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధనను పాటించలేదని నోటీసులు
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. వివరాల్లోకి వెళ్తే, పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంతో పాటు, తనను సస్పెండ్ చేసిన అంశంపై మార్చి 21న వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడం తప్పని నోటీసులో పేర్కొన్నారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశాన్ని నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసు అందిన వారంలోగా వివరణ ఇవ్వాలని... లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని నోటీసులో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.