Terrorism: కశ్మీరీ పండిట్ పై ఉగ్రవాదుల కాల్పులు
- కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఘటన
- ఒక్కరోజులోనే నాలుగు దాడులు
- అంతకుముందు వలస కార్మికులపై కాల్పులు
- సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడిలో ఒకరి మృతి
ఓ కశ్మీరీ పండిట్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో బాల కిషన్ అనే పండిట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాల కిషన్ చెయ్యి, కాలిలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. గాయపడిన బాల కిషన్ ను శ్రీనగర్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలకిషన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కాగా, ఆదివారం నుంచి ఉగ్రవాదులు దాడికి పాల్పడడం ఇది నాలుగోసారి. అంతకుముందు పుల్వామాలో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే శ్రీనగర్ లోని మైసూమా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు.
తర్వాత మరో ఇద్దరిపైనా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తాజాగా కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరిపారు. గత నెల రోజులుగా కశ్మీర్ లో ఉంటున్న స్థానికేతరులపై ఉగ్రమూకలు దాడులకు తెగబడుతున్న ఘటనలు భారీగా పెరిగాయి.