Perni Nani: మరో కొత్త జిల్లా ఏర్పాటుపై జగన్ ఆలోచిస్తున్నారు: మంత్రి పేర్ని నాని
- గిరిజన ప్రాంతాలతో మరో జిల్లా ఏర్పాటు దిశగా యోచన
- ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాల ఏర్పాటు
- మరో జిల్లా వస్తే పాలన సులభతరమవుతుందన్న పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య 26కి చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా... ప్రభుత్వం వాటిని 26 జిల్లాలకు పెంచింది. ముఖ్యమంత్రి జగన్ నిన్న తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు.
మరోవైపు, మంత్రి పేర్ని నాని ఈరోజు మరో ఆసక్తికర ప్రకటన చేశారు. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని గిరిజన ప్రాంతాలతో మరో జిల్లా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందని అన్నారు. రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలను ఏర్పాటు చేశామని... మరో జిల్లాను కూడా ఏర్పాటు చేస్తే పాలన మరింత సులభతరమవుతుందని అన్నారు.