Vijayashanti: బంజారాహిల్స్ లోని ఆ ఒక్క పబ్ పైనే దాడులు చేయడం అనుమానాలు కలిగిస్తోంది: విజయశాంతి

Vijayasanthi comments on pub case

  • రాడిసన్ బ్లూ హోటల్లో పోలీసుల దాడులు
  • పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ లభ్యం
  • సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలన్న విజయశాంతి 

హైదరాబాదు బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్ పబ్ (పుడ్డింగ్ అండ్ మింక్)పై పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. అనేకమంది ప్రముఖుల పిల్లలు ఈ పబ్ లో పట్టుబడ్డారన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దీనిపై తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. హైదరాబాదులో బట్టబయలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతోందని తెలిపారు. సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలే కాకుండా మైనర్లు కూడా ఉండడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. 

చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని, కానీ కేసీఆర్ సర్కారు మొద్దనిద్ర పోతోందని విజయశాంతి విమర్శించారు. నగరంలోని ఎన్నో పబ్ లపై ఆరోపణలు ఉన్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొకైన్, చరస్ వంటి మత్తుపదార్థాలతో దండా నడిపిస్తున్నారని వివరించారు. కానీ, బంజారాహిల్స్ లోని ఒక పబ్ నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు.  

రాజకీయ ఉద్దేశాలతోనే ఈ దాడులు చేశారని స్పష్టం చేశారు. ఇంకా దర్యాప్తు పూర్తవకముందే, డ్రగ్స్ ఎవరు తీసుకున్నారో తేలకముందే... కొందరు టీఆర్ఎస్ నేతలు బహిరంగ విమర్శలు చేయడం ఈ సందేహాలను బలపరుస్తున్నాయని విజయశాంతి పేర్కొన్నారు. 145 మందిని అదుపులోకి తీసుకుని వాళ్లను కొన్ని గంటల పాటు స్టేషన్లో ఉంచారని, అయితే వారిలో ఒక్కరి నుంచి కూడా రక్త నమూనాలు తీసుకోకపోవడమేంటని ఆమె ప్రశ్నించారు. కావాలనే కొన్ని పేర్లను మీడియాకు లీక్ చేశారని ఆరోపించారు. 

హైదరాబాద్ పరిధిలో 80 పబ్బులు ఉన్నాయని, 10 స్టార్ హోటళ్లలో 24 గంటలు లిక్కర్ సరఫరా చేసేందుకు అనుమతులున్నాయని వివరించారు. ఇలా అనుమతించిన వాటి నుంచి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఫీజు వసూలు చేస్తుందని తెలిపారు. గతంలో సినీ హీరోలు, సెలబ్రిటీలు పబ్బులు నిర్వహించేవారని, అయితే కొన్నింటిపై పోలీసుల దాడుల నేపథ్యంలో హీరోల పేర్లు బయటికి వచ్చాయని వెల్లడించారు. తర్వాత కొంతకాలానికే ఆ పబ్బులు అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయని వివరించారు. వాళ్లు కావాలనే ఇతర పబ్ లపై దాడులు చేయిస్తున్నారని, కానీ, అధికార పార్టీ నేతలు నడిపే పబ్బుల్లో ఇంతకంటే దారుణంగా డ్రగ్స్ దందా నడుస్తోందని విజయశాంతి ఆరోపణలు చేశారు.

వీటిపై సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను మరో పంజాబ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. యువతను డ్రగ్స్ నుంచి దూరం చేయాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందని, డ్రగ్స్ దందా చేస్తున్న ఈ దగాకోరు సర్కారును గద్దె దించుదామని విజయశాంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో స్పందించారు.

  • Loading...

More Telugu News