Group health: పాలసీదారులకు ప్రీమియం బాదుడు మొదలెట్టిన బీమా కంపెనీలు

Insurers raise premium

  • రెన్యువల్ ప్రీమియం రేట్లను సవరించిన పలు కంపెనీలు
  • కరోనాతో అధిక క్లెయిమ్ లు
  • ఇప్పటికీ రేట్లను పెంచని కొన్ని కంపెనీలు
  • సవరణ కోసం ఐఆర్డీఏఐకు దరఖాస్తు

కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించగానే బీమా కంపెనీలు ప్రీమియం రేట్లను పెంచే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు రెన్యువల్ ప్రీమియంను పెంచేయగా.. మరికొన్ని బీమారంగ నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) అనుమతుల కోసం వేచి చూస్తున్నాయి. 

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రీమియం రేటును 40 శాతం వరకు పెంచితే.. సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీ ప్రీమియాన్ని ఏకంగా 80-100 శాతం మేర సవరించేశాయి. రీ ఇన్సూరెన్స్ సంస్థ (బీమా కంపెనీలు జారీ చేసే పాలసీలపై బీమా కవరేజీ ఇచ్చే సంస్థ) జీఐసీఆర్ఈ, ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) హెల్త్, సైబర్ కాకుండా ఇతర పాలసీల ప్రీమియం రేట్లను 20-30 శాతం మేర పెంచాయి. 

గ్రూపు హెల్త్ పాలసీల ప్రీమియం 40 శాతం వరకు పెరిగింది. కరోనా వల్ల అధిక క్లెయిమ్ లు రావడమే ప్రీమియం పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో భారీగా క్లెయిమ్ లు రావడంతో సాధారణ బీమా, హెల్త్ బీమా కంపెనీలు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రీమియం రేట్లను పెంచేశాయి. కానీ, పెంచకుండా ఉండిపోయిన కొన్ని కంపెనీలు ఇప్పుడు ప్రీమియం రేట్ల సవరణకు ఐఆర్డీఏఐ వద్ద దరఖాస్తు పెట్టుకున్నాయి. 

హెచ్ డీఎఫ్ సీ ఎర్గో, కేర్ హెల్త్ సవరించిన ప్రీమియం రేట్లతో ఉత్పత్తులకు ఐఆర్డీఏఐ ఆమోదం పొందాయి. నివా బూపా సహా మరికొన్ని  కంపెనీలు రేట్ల సవరణ కోసం దరఖాస్తు పెట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News