Tamilisai Soundararajan: ప్రధానిని కలిసింది తెలంగాణ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాదు: గవర్నర్ తమిళిసై
- తెలంగాణ ప్రభుత్వం ఒక పేరును సేవా రంగంలో ప్రతిపాదించింది
- ప్రభుత్వం సూచించిన ఆ వ్యక్తికి అర్హత లేదు
- నా అభిప్రాయాన్ని నేను చెప్పాను
- తెలంగాణలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్న గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఒక పేరును సేవా రంగంలో ప్రతిపాదించిందని ఆమె అన్నారు.
అయితే, ప్రభుత్వం తనకు సూచించిన ఆ వ్యక్తికి అర్హత లేదని తాను భావించానని, తన అభిప్రాయాన్ని తాను చెప్పానని స్పష్టం చేశారు. రాజ్యాంగం, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలని, వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ప్రధాని మోదీతో పలు అంశాలపై చర్చించానని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేశారని ఆమె అన్నారు.
అంతేగానీ, తాను ప్రధానిని కలిసింది తెలంగాణ సర్కారుపై ఫిర్యాదు చేసేందుకు కాదని ఆమె చెప్పారు. తెలంగాణలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవని ఆమె తెలిపారు. కాగా, ఇటీవల తెలంగాణలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తమిళిసై ఢిల్లీ పర్యటిస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
కాసేపట్లో ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కేంద్ర హోంశాఖ పిలుపు మేరకే ఆమె ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వ్యవహారం నుంచి శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ నియామకం, తదితర పరిణామాల నేపథ్యంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కూడా వరుసగా పలు పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ అంశాలపై కేంద్ర మంత్రులతో తమిళిసై చర్చిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె నేడు మీడియా సమావేశంలో మాట్లాడి వివరణ ఇచ్చారు.