Shobha Karandlaje: తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి శోభ కరంద్లాజే ప్రకటన
- తెలంగాణ ధాన్యం సేకరణపై తెలుగులో ట్వీట్
- ఖరీఫ్ ధాన్యం సేకరణపై వివరాల వెల్లడి
- 10.6 లక్షల మంది తెలంగాణ రైతులకు మద్దతు ధర దక్కిందని ప్రకటన
తెలంగాణలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తిస్తున్న సమయంలో కర్ణాటకకు చెందిన బీజేపీ కీలక నేత, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే కీలక ప్రకటన చేశారు. 2021-22 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగిందని, దీని వల్ల రాష్ట్రంలో 10.6 లక్షల మంది రైతులు తమ పంట ఉత్పత్తులకు మద్దతు ధరను పొందారని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ ధాన్యం సేకరణకు సంబంధించి తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.13,763.12 కోట్లకు పైగా నిధులు జమ చేశామని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రం విడుదల చేసిన నివేదిక ద్వారా ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఆమె తెలుగులో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.