Andhra Pradesh: 'ఈజ్ ఆఫ్ డూయింగ్' బిజినెస్ లో మళ్లీ ఏపీనే నెంబర్ వన్
- విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్‌గా ఏపీ
- ఇన్వెస్ట్ ఇండియా నివేదిక వెల్లడి
- ఏపీలోని అపార వనరులే ఇందుకు కారణమని స్పష్టీకరణ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ తన నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. కరోనా కష్టకాలంలోనూ విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సత్తా చాటింది. ఈ మేరకు బుధవారం ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఈ విషయం స్పష్టమైంది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయిని ఆ నివేదిక వెల్లడించింది.
ఏపీలో ఆరు ఓడరేవులు, ఆరు విమానాశ్రయాలు, 1,23,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండడం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని…పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని ఇన్వెస్ట్ ఇండియా స్పష్టం చేసింది.