Visakhapatnam District: అశోక్ గజపతిరాజు ఛైర్మన్‌గా సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం.. ఉత్తర్వుల జారీ
- రెండేళ్ల కాలానికి గాను 14 మంది నియమాకం
- వైసీపీ నేత దొడ్డి రమణకు సభ్యుడిగా అవకాశం
- పాత పాలకవర్గంలోని ఒకరికి మళ్లీ చాన్స్
విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయానికి ప్రభుత్వం కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రమాజీ మంత్రి, వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూనే మరో 14 మందిని రెండేళ్ల కాలానికి గాను సభ్యులుగా నియమించింది. వీరిలో గాజువాక ప్రాంతంలో వైసీపీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలైన దొడ్డి రమణ కూడా ఉన్నారు. అలాగే, ప్రస్తుత పాలకవర్గ సభ్యుడిగా ఉన్న వారణాసి దినేష్‌రాజుకు మరోమారు అవకాశం కల్పించారు.
రెండేళ్ల క్రితం అశోక్ గజపతిరాజును తొలగించి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం ఆలయ ఛైర్ పర్సన్‌గా నియమించింది. రాజకీయంగా ఇది పెను దుమారమే రేపింది. ఛైర్ పర్సన్ పదవి నుంచి తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంచయిత నియమాకాన్ని రద్దు చేసిన కోర్టు అశోక్‌ను తిరిగి ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా, అశోక్‌ను కొనసాగిస్తూనే కొత్త పాలకవర్గాన్ని ప్రభుత్వం నియమించింది.