Junior NTR: బాలీవుడ్ బాక్సాఫీస్ ను అదరగొట్టేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్'
- తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ ఆర్ ఆర్' జోరు
- దేశ విదేశాల్లోను అదే తీరు
- బాలీవుడ్ లో 200 కోట్ల వసూళ్లు
- సీక్వెల్ ఉందని చెప్పిన విజయేంద్రప్రసాద్
ఎక్కడ చూసినా 'ఆర్ ఆర్ ఆర్' విజృంభణం .. ప్రభంజనమే కనిపిస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. కొత్త రికార్డులను నమోదు చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. నైజామ్ లో 101 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ఈ సినిమా, బాలీవుడ్ నుంచి మరో రికార్డును అందుకుంది.
ఈ సినిమా హిందీ వెర్షన్ కి మొదటి రోజు నుంచీ మంచి ఆదరణ లభిస్తోంది. సాధారణంగా హిందీలో 100 కోట్ల మార్కును టచ్ చేయడమే గొప్పగా భావిస్తుంటారు. కానీ 'ఆర్ ఆర్ ఆర్' 200 కోట్ల మార్క్ ను టచ్ చేసి అక్కడి స్టార్ హీరోలు .. దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయేలా చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ 300 కోట్ల వసూళ్లను రాబట్టవచ్చనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాజమౌళి ఆశించిన స్థాయి సపోర్ట్ లభించకపోయినప్పటికీ, వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిడివి తక్కువే అయినా అలియా భట్ నటించడం .. అజయ్ దేవగణ్ పాత్ర హైలైట్ కావడం బాలీవుడ్ వసూళ్లకు కొంతవరకూ కలిసొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని విజయేంద్రప్రసాద్ చెబుతుండటం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.