K Narayana Swamy: వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించినప్పుడూ నేను బాధపడలేదు: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- మళ్లీ మంత్రిని కావాలనే ఆశ లేదు
- ఎప్పటికీ వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక
- నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ ఎంతో గౌరవించారు
- జగనే తన యజమాని, నాయకుడు అన్న నారాయణ స్వామి
ఏపీ కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దీనిపై స్పందిస్తూ.. తాను మళ్లీ మంత్రిని కావాలనే ఆశ లేదని చెప్పారు. అయితే, ఎప్పటికీ వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి జగన్ ఎంతో గౌరవించారని ఆయన అన్నారు.
జగనే తన యజమాని, నాయకుడు అని వ్యాఖ్యానించారు. జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు. వైఎస్ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. తనను గతంలో వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించినప్పుడు కూడా తానేం బాధపడలేదని తెలిపారు.
దళితుడిని కాబట్టే ఆ బాధ్యతల నుంచి తప్పించారని కొందరు ఆ సమయంలో పలు వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు. తన శాఖపై ప్రతిపక్ష పార్టీల నేతలు అర్థం లేని విమర్శలు చేశారని ఆయన అన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్నే సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని ఆయన చెప్పారు.