Traders: ప్రతిదీ చైనాకు అమ్మేశారు... శ్రీలంక ప్రభుత్వంపై వ్యాపారుల ఆగ్రహం
- శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం
- ఆకాశాన్నంటుతున్న ధరలు
- రాజపక్సపై సర్వత్రా ఆగ్రహావేశాలు
- పదవి నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్
శ్రీలంకలో సంక్షోభం నేపథ్యంలో అన్ని వర్గాల వారిలోనూ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా, శ్రీలంకలోని ఆహార విక్రేతలు రాజపక్స ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశంలోని ప్రతిదీ చైనాకు అమ్మేశారంటూ ఆరోపించారు. ఇప్పుడు దేశంలో ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడిందని, ఏది కొనాలన్నా అప్పు మీద విదేశాలపై ఆధారపడాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక, రాజకీయ సంక్షోభం దరిమిలా పండ్లు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఫరూఖ్ అనే పండ్ల అమ్మకందారు మాట్లాడుతూ, మూడ్నాలుగు నెలల కిందట ఆపిల్ పళ్లు కిలో రూ.500కు అమ్మితే, ఇప్పుడది రూ.1000కి పెరిగిందని వెల్లడించారు. పీర్ పండ్లు ఇంతకుముందు కిలో రూ.700 పలికితే, ఇప్పుడు వాటి ధర రూ.1500కి చేరిందని వివరించారు. ప్రజల వద్ద అంత డబ్బు లేదని పేర్కొన్నారు. శ్రీలంక ప్రభుత్వం అన్నీ చైనాకు ధారాదత్తం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఫరూఖ్ ఆరోపించారు.
గొటబాయ రాజపక్స పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని రాజా అనే మరో పండ్ల విక్రయదారుడు డిమాండ్ చేశారు. శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు నానాటికీ అడుగంటి పోతుండడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో ప్రధానంగా ఆహార కొరత, ఇంధన కొరత వేధిస్తున్నాయి. భారత్ వంటి దేశాలు అందించే సాయమే ఇప్పుడు శ్రీలంకను నడిపిస్తున్నట్టుగా భావించాలి.