Anand Mahindra: ఈ టెక్నాలజీ మన వద్ద ఉంటే ప్రపంచశక్తిగా మారతాం: ఆనంద్ మహీంద్రా
- రోడ్డుపై విండ్ టర్బైన్లు
- వాహనాల వేగానికి తిరిగే టర్బైన్లు
- గంటకు ఒక కిలోవాట్ శక్తి ఉత్పాదన
- భారత్ లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్న ఆనంద్
పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా విండ్ టర్బైన్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. ఈ టెక్నాలజీ భారత్ వద్ద ఉంటే కచ్చితంగా ప్రపంచశక్తిగా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
నిత్యం ట్రాఫిక్ నడిచే రోడ్డు మధ్యలో ఓ గాలితో తిరిగే టర్బైన్ ఉంటుంది. వాహనాల వేగానికి ఆ టర్బైన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా ఒక గంటలోనే 1 కిలోవాట్ శక్తి జనిస్తుంది. ఈ సాంకేతికతను టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
భారత్ లో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందేనని, ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే పవన విద్యుత్ రంగంలో భారత్ కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు, టర్కీ అభివృద్ధి చేసిన విండ్ టర్బైన్ పనితీరు వీడియోను కూడా పంచుకున్నారు.