AP Cabinet: ఖాళీ లెటర్ హెడ్లతో 24 మంది మంత్రులు.. ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
- కేబినెట్ భేటీలోనే మంత్రుల రాజీనామా?
- 24 మంది మంత్రుల హాజరు
- రెవెన్యూ డివిజన్లకు ఆమోదం
- కొత్తగా కొత్తపేట కేంద్రగా మరో డివిజన్‌కు గ్రీన్ సిగ్నల్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కాసేపటి క్రితం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశమే కేబినెట్లోని 24 మంది మంత్రులకు చివరి కేబినెట్ సమావేశంగా పరిగణిస్తున్న నేపథ్యంలో భేటీకి హాజరైన మొత్తం 24 మంది మంత్రులు తమ వెంట ఖాళీ లెటర్ హెడ్లను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో నిర్దేశిత అజెండాపై చర్చ ముగియగానే... మంత్రులంతా తమ పదవులకు రాజీనామాలు చేయనున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే... ఈ భేటీలో మొత్తం 36 అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు కోనసీమ జిల్లాలో కొత్తపేట కేంద్రంగా మరో కొత్త రెవెన్యూ డివిజన్‌కు కూడా కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా సమాచారం.