Road Accident: రోడ్డు ప్రమాదంలో వైసీపీ మహిళా ఎంపీపీ దుర్మరణంపై నారా లోకేశ్ ట్వీట్
- విజయవాడ పరిసరాల్లో రోడ్డు ప్రమాదం
- ప్రమాదంలో చనిపోయిన వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి
- ఈ ప్రమాదానికి రోడ్డుపై పడిన గుంతే కారణమన్న లోకేశ్
- కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వని కారణంగానే రోడ్డుపై గుంత పడిందన్న టీడీపీ నేత
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైసీపీ ఎంపీపీ ప్రసన్నలక్ష్మి ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహిళా ఎంపీపీ ప్రసన్నలక్ష్మి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదన్న లోకేశ్.. జగన్ రెడ్డి సర్కారు చేసిన దారుణ హత్యగానే ఈ ఘటనను పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీగా కొనసాగుతున్న ప్రసన్న లక్ష్మి బుధవారం విజయవాడ సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి రోడ్డుపై పడిన గొయ్యే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ చేతకాని పాలన, అవినీతి దాహం, బంధుప్రీతి వల్ల ఆయన పార్టీ నేతలూ బలవుతున్నారని లోకేశ్ ఆరోపించారు. ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతుల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో ఎవరూ కనీసం గుంతలో తట్టెడు మట్టి కప్పడానికి ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. అలా పడిన గుంతే వైసీపీకి చెందిన కృష్ణా జిల్లా ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్నలక్ష్మి ప్రాణం తీసిందన్న లోకేశ్.. కొనప్రాణంతోనైనా ప్రసన్నలక్ష్మి బతికే అవకాశం ఉన్నా జగన్‌రెడ్డి అవినీతి దాహం-బంధుప్రీతి మృత్యువులా ఆమెను వెంటాడిందని పేర్కొన్నారు.
అంబులెన్సుల్లో వందల కోట్లు దోచేందుకు విజయసాయిరెడ్డి అల్లుడికి అంబులెన్స్‌ల కాంట్రాక్టును జగన్ కట్టబెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు. ప్రమాదం జరిగిందని అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే సాయిరెడ్డి అల్లుడి అంబులెన్స్ రాలేదన్న లోకేశ్.. ఈ కారణంగానే ప్రసన్నలక్ష్మి ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఇది రోడ్డు ప్రమాదంలో మృతి కాదని, జగన్‌రెడ్డి సర్కారు చేసిన దారుణహత్య అంటూ ఆయన ఘాటు కామెంట్ చేశారు.