Harish Rao: కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు: హరీశ్ రావు
- బీజేపీకి రైతులు, కార్మికులు గిట్టడం లేదన్న హరీశ్
- అచ్చేదిన్ అని చెప్పి సచ్చేదిన్ అనేలా చేస్తోందంటూ వ్యాఖ్య
- మోదీ అంటే మోదుడు.. బీజేపీ అంటే బాదుడు అని కామెంట్
తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు ఊరుకోబోమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్ర రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే బీజేపీకి... పేదలు, కార్మికులు అంటే గిట్టడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ సర్కార్ చెప్పిందని... కానీ, రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు.
పంజాబ్ లో వడ్లు కొన్నట్టే తెలంగాణలో కూడా వడ్లు కొనాలని హరీశ్ డిమాండ్ చేశారు. అచ్చేదిన్ అని చెప్పిన బీజేపీ ఇప్పుడు సచ్చేదిన్ అనేలా చేస్తోందని విమర్శించారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని అన్నారు. నిబద్ధత తెలియని పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. మోదీ అంటే మోదుడు, బీజేపీ అంటే బాదుడు అని ఎద్దేవా చేశారు. 16.50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని మంత్రి అన్నారు.