AP Cabinet: జగన్ నిర్ణయమే ఫైనల్!... మంత్రి పదవుల రాజీనామాపై బొత్స!
- ఎవరిని కొనసాగించాలనేది జగన్ ఇష్టం
- దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో ఉంటాం
- వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యమన్న బొత్స
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కేబినెట్‌లోని మొత్తం 24 మంది మంత్రులతో రాజీనామాలు చేయించిన సంగతి తెలిసిందే. గురువారం ఏపీ సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ ఆదేశించగానే... మంత్రులంతా మూకుమ్మడిగా మంత్రి పదవులకు రాజీనామాలు చేసేశారు. ఆ తర్వాత మంత్రుల్లో మెజారిటీ నేతలు ఇంటి బాట పట్టగా... సీనియర్ మంత్రి బొత్స మాత్రం తన ఛాంబర్‌లో మరో ముగ్గురు మంత్రులతో భేటీ అయ్యారు.
ఈ భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన బొత్స.. మంత్రుల రాజీనామాలు, తమ భవిష్యత్తు కార్యాచరణపై మీడియాతో మాట్లాడారు. తన కేబినెట్‌లో ఎవరిని ఉంచుకోవాలన్నది సీఎంగా జగన్ ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని కూడా బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో జగన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మందిలో తనకు చోటు ఉంటుదన్న బొత్స.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూర్చడమే తమ లక్ష్యమని చెప్పారు.