Majlis Party: అక్బరుద్దీన్ హేట్ స్పీచ్‌పై విచారణ పూర్తి.. ఈ నెల 12న తుది తీర్పు
- ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో అక్బర్ ప్రసంగాలు
- మత విద్వేషాలను రెచ్చగొట్టారంటూ పోలీసు కేసులు
- అరెస్టై బెయిల్‌పై ఉన్న మజ్లిస్ నేత
మజ్లిస్ పార్టీ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్‌లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన చేసిన హేట్ స్పీచ్ (విద్వేషపూరిత ప్రసంగాలు)కు సంబంధించి కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును వెలువరించనున్నట్లు కోర్టు గురువారం ప్రకటించింది.
మజ్లిస్ పార్టీ సమావేశమంటూ ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన అక్బరుద్దీన్ రాత్రివేళల్లో జరిగిన ఆ సమావేశాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ఆ తర్వాత కోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసు విచారణలో సుదీర్ఘంగా వాదనలు జరగగా... గురువారం నాటి విచారణలో వాదనలు ముగిసినట్టు కోర్టు ప్రకటించింది. ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించింది.