Andhra Pradesh: మేమేమీ అలా ఫీలవడం లేదు: రాజీనామాలపై ఏపీ మంత్రులు
- చాలా సంతోషంగా ఉన్నామన్న మంత్రులు
- జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రతిన
- 2024లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఉద్ఘాటన
మంత్రి పదవులకు రాజీనామా చేసినందుకు తామేమీ ఫీలవడం లేదని, హ్యాపీగానే ఉన్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం నిన్న మీడియాతో మాట్లాడిన మంత్రి చివరి సమావేశం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా సాగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యత తీసుకోవడమంటే 2024లో వైసీపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకున్నట్టేనని అన్నారు. ఇంట్లో మాంసం కూర ఉన్నప్పుడు పప్పు తినమన్నట్టు ఫీలయ్యే పరిస్థితి లేదని అన్నారు. తమకు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తామని సీఎంకు చెప్పామన్నారు. జగన్‌కు ఎంతగానో రుణపడి ఉంటామన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. దేవుడు తథాస్తు అంటే మళ్లీ ఆ 24 మంది కొత్త మంత్రుల్లో తానూ ఉంటానని, లేదంటే వేరే బాధ్యతల్లో ఉంటానని అన్నారు.
మంత్రి పదవుల నుంచి తమను తప్పించడంపై తమకంటే జగనే ఎక్కువగా బాధపడుతున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసని, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అన్నారు.
రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని జగన్ ముందే చెప్పారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, మంత్రి పదవి వస్తుందని ఊహించలేదని అన్నారు. జీవితాంతం జగనే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
కరోనా కారణంగా తాను పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయానని, అయినా ఈ పదవీకాలం తనకు సంతృప్తినిచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశాన్ని ఆయన తమకు కల్పిస్తున్నారని మంత్రులు సీదిరి అప్పలరాజు, గుమ్మనూరు జయరాం, అనిల్‌కుమార్, పినిపె విశ్వరూప్, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.