Russia: తగ్గేదే లే అంటున్న రష్యా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపై నిషేధం!
- రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పలు దేశాలు
- అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తున్న రష్యా
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు చెందిన 358 మందిపై రష్యా నిషేధం
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. తాజాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అంతేకాదు ఆ రెండు దేశాలకు చెందిన మంత్రులు, ఎంపీలు కూడా రష్యాలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పింది. తమపై ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఆస్ట్రేలియాకు చెందిన 228 మంది, న్యూజిలాండ్ కు చెందిన 130 మందితో కూడిన జాబితాను రష్యా విడుదల చేసింది. వీరిలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ల పేర్లు ఉన్నాయి. మరోవైపు రష్యా మరో కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఆస్ట్రేలియా మిలిటరీ, వ్యాపారవేత్తలు, రష్యాకు వ్యతిరేకంగా ఉండే జర్నలిస్టులపై కూడా నిషేధం విధిస్తామని తెలిపింది.