Banana: అరటి పండు ఆరోగ్యాన్నిస్తుందా..?
- అరటిలో ఎన్నో ఔషధ గుణాలు
- జీర్ణాశయానికి ఎంతో మంచిది
- గుండెమంట, అల్సర్లకు సహజ పరిష్కారం
- కండరాల బలోపేతానికి మంచి ఆహారం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే పండ్లలో అరటి పండు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న చౌక పండు. ఇందులోనూ ఎక్కువగా వినియోగమయ్యేది పసుపుపచ్చని అరటి పండ్లే. రోజూ ఒక అరటి పండు అయినా తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
పేగులకు మంచిది
పేగులకు అరటి పండు ఎంతో మేలు చేస్తుంది. అరటిలో పెక్టిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది నీటిలో కరిగే పీచు పదార్థం. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరాన్ని అరటి పండు తగ్గిస్తుంది.
గుండెకు మేలు
అరటి పండులో సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువే. ఇందులో లభించే పొటాషియం గుండె చక్కగా పనిచేసేందుకు సాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటి పండుని రోజూ తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తుందని పలు అధ్యయన నివేదికలు తేల్చి చెప్పాయి.
అల్సర్లకు మంచి మందు
గుండె మంటగా అనిపించినప్పుడు అరటి పండు బాగా పండింది తిని చూడండి. వెంటనే తగ్గుతుంది. పొట్టలో పీహెచ్ బ్యాలన్స్ ను అరటి పండు కాపాడుతుంది. తిన్న ఆహారం జీర్ణమవడానికి సాయపడుతుంది. తద్వారా రక్తం వేగంగా జీర్ణాశయానికి చేరేందుకు తోడ్పడుతుంది. అరటిలో ఉండే ప్రొటీజ్ ఇన్హిబిటర్స్ కడుపులో అల్సర్లకు కారణమయ్యే బ్యాక్టీరియాపై పోరాడతాయి.
కండరాల బలోపేతం
మంచి కండపుష్టి కోరుకునే వారు అరటి పండును రోజూ తీసుకోవావాల్సిందే. కండరాల బలోపేతానికి సాయపడే మెగ్నీషియం అరటిలో ఉంటుంది. అందుకే జిమ్ లో కసరత్తులు చేసే వారు అరటి పండ్లను తీసుకుంటూ ఉంటారు. శరీరంలో కొవ్వు కరిగేందుకు కూడా మెగ్నీషియం సాయపడుతుంది.
మంచి మూడ్ కోసం
అరటి పండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీన్ని శరీరం సెరటోనిన్ గా మారుస్తుంది. మనసుకు ఉత్సాహాన్నిచ్చే రసాయనం ఇది.