Shoaib Akhtar: పెద్ద తప్పుచేశావని గంగూలీ అన్నాడు: అక్తర్

Akhtar reveals IPL inauguration edition memories

  • ఓ ఇంటర్వ్యూలో అక్తర్ ఆసక్తికర అంశాల వెల్లడి
  • 2008లో ఐపీఎల్ ప్రారంభం
  • కోల్ కతాతో తలపడిన ముంబయి
  • వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • తొలి ఓవర్లోనే సచిన్ వికెట్ తీసిన అక్తర్
  • అక్తర్ ను తీవ్రంగా దూషించిన ముంబయి ప్రేక్షకులు

పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంగతులు పంచుకున్నాడు. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ లో తాను ఆడినప్పటి అనుభవాలను అక్తర్ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో తాను కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించినట్టు తెలిపాడు. ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో తాను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేశానని, కానీ అదెంత పెద్ద తప్పో తర్వాత అర్థమైందని అక్తర్ వివరించాడు. 

"ఆ మ్యాచ్ కు వాంఖెడే స్టేడియం వేదిక. సచిన్ ఆడుతుండడంతో జనంతో స్టేడియం క్రిక్కిరిసిపోయింది. నా మొదటి ఓవర్లోనే సచిన్ వికెట్ తీశాను. ఓవర్ అయిపోయిన తర్వాత ఫైన్ లెగ్ పొజిషన్ లో ఫీల్డింగ్ కు వెళ్లాను. దాంతో ముంబయి జనాలు నన్ను విపరీతమైన మాటలతో దూషించడం ప్రారంభించారు. ఇంతలో కెప్టెన్ సౌరవ్ గంగూలీ వచ్చి... అసలు నిన్ను సచిన్ ను అవుట్ చేయమని ఎవరు చెప్పారు? ఇది ముంబయి అని మర్చిపోయావా? వాళ్లు నిన్ను బతకనిచ్చేట్టు లేరు. నువ్వు అక్కడొద్దు... మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చెయ్... అని చెప్పాడు. సచిన్ ను అవుట్ చేసిన కారణంగానే ప్రేక్షకులతో అన్ని మాటలు పడాల్సి వచ్చింది" అని అక్తర్ వివరించాడు. 

కాగా, ఆనాటి మ్యాచ్ లో కోల్ కతా మొదట 67 పరుగులకే కుప్పకూలగా, ముంబయి ఇండియన్స్ 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక స్టార్ ఆటగాడు సనత్ జయసూర్య 17 బంతుల్లో 43 పరుగులతో విశ్వరూపం ప్రదర్శించడం నాటి మ్యాచ్ లో హైలైట్. సచిన్ డకౌట్ అయినా, జయసూర్య, రాబిన్ ఊతప్ప పనిపూర్తి చేశారు. ఏదేమైనా సచిన్ వికెట్ తీసిన ఫలితంగా ముంబయిలో ఆ మ్యాచ్ షోయబ్ అక్తర్ కు చిత్రమైన అనుభవాన్ని అందించింది.

  • Loading...

More Telugu News