Andhra Pradesh: జగన్‌తో సజ్జల సుదీర్ఘ చర్చ... ఏమేం చర్చించారంటే..!
- 3 గంటల పాటు సాగిన భేటీ
- కొత్త కేబినెట్ కూర్పుపైనే సాంతంగా చర్చ
- కూర్పులో అన్ని అంశాలపైనా లోతైన చర్చ
ఏపీ కేబినెట్ కూర్పునకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వైసీపీ కీలక నేత, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వేదికగా జరిగిన ఈ భేటీ దాదాపుగా 3 గంటలకు పైగా సాగింది. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో సాంతం కొత్త కేబినెట్ కూర్పుపైనే చర్చ జరిగింది.
తన కేబినెట్లోని మంత్రులందరి చేత రాజీనామాలు చేయించిన సీఎం జగన్..కొత్త కేబినెట్ కూర్పుపై ఇప్పటికే ఓ అవగాహనతో ఉన్నారన్న దిశగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజీనామా చేసిన మంత్రుల్లో ఓ నలుగురైదుగురిని తిరిగి కొత్తి కేబినెట్లోకి తీసుకుంటారని స్వయంగా మంత్రులే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామాలు చేసిన మంత్రుల్లో ఎవరెవరిని కొత్త కేబినెట్లోకి తీసుకోవాలన్న విషయంపై సజ్జలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా కొత్తగా మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలన్న విషయంపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
మొత్తంగా సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, సమర్థత, కొత్త జిల్లాల్లో అన్నింటికీ ప్రాధాన్యం దక్కేలా కేబినెట్ కూర్పు ఉండాలన్నట్లుగా సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ భావనకు సరిపోలేలా అన్ని అంశాలపై లోతైన చర్చలు ఈ భేటీలో జరిగాయి. కొత్త కేబినెట్‌కు సంబంధించి ఈ భేటీలో ఫుల్ క్లారిటీ వచ్చిందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.