YSRCP: ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు: పోలీసులకు విజయ సాయిరెడ్డి ఫిర్యాదు
- రుషికొండ భూకబ్జాల పేరిట టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న విజయసాయి
- తన కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
- ఆ భూముల కేటాయింపు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదని వివరణ
- టీడీపీ అక్రమార్కులపై చర్యలు తప్పవన్న విజయసాయి
వైసీపీ, సీఎం జగన్‌లతో పాటు తన, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాసేపటి క్రితం ఆయన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
"రుషికొండ భూకబ్జాల పేరిట వైసీపీపై, సీఎం జగన్‌పై, నాపై, నా కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రుషికొండ ఎన్సీసీ భూముల వ్యవహారంలో టీడీపీ వాళ్లు కావాలని దుష్ప్రచారం చేస్తోంది. దీనిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆ భూముల కేటాయింపు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదు. టీడీపీ ప్రభుత్వంలోనే ఆ సంస్థకు జీపీఏ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. టీడీపీ అక్రమార్కులపై చర్యలు తప్పవు. రెండేళ్లలో 10 వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది" అని తన ట్వీట్లలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.