CJI: జడ్జీలను ప్రభుత్వాలు దూషించడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది.. ఇది దురదృష్టకరం: సీజేఐ ఎన్వీ రమణ

Maligning judges has become as new trend says CJI NV Ramana

  • గతంలో ప్రైవేట్ వ్యక్తులు ఇలా చేసేవారన్న సీజేఐ  
  • ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్య 
  • కోర్టులను కించపరచడానికి ప్రయత్నించవద్దని సలహా 

జడ్జీలను, కోర్టులను ప్రభుత్వాలు విమర్శిస్తుండటం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలను మనం ఎన్నింటినో చూశాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. జడ్జీలను ప్రభుత్వాలు దూషించడం ఇటీవలి కాలంలో కొత్త ట్రెండ్ అని ఆయన అన్నారు. 

వివరాల్లోకి వెళ్తే, చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్ లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసును 2020లో చత్తీస్ గఢ్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, జడ్జీలను ప్రభుత్వాలు దూషించడం కొత్త ట్రెండ్ గా మారిందని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయమని చెప్పారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులు ఇలా వ్యవహరించేవారని... ఇప్పుడు ప్రభుత్వాలే అలా వ్యవహరిస్తుండటం దారుణమని అన్నారు. న్యాయమూర్తులపై ప్రభుత్వాలు దుష్ప్రచారాలకు పాల్పడటం ప్రారంభమయిందని చెప్పారు. ఇలాంటి వాటిని తాము ప్రతి రోజు కోర్టుల్లో చూస్తున్నామని తెలిపారు. కోర్టులను కించపరచడానికి ప్రయత్నించవద్దని అన్నారు. అయితే ఈ సందర్భంగా చత్తీస్ గఢ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది దవే మాట్లాడుతూ, తాము ఎవరినీ కించపరచడం లేదని కోర్టుకు తెలిపారు.

  • Loading...

More Telugu News